కేరళ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు కేరళ సీఎం వీడీ సతీషన్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. వారాల తరబడి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో ఇది అనివార్యం అని ఆయన పేర్కొన్నారు. రాజీనామా ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఇక పదవిలో కొనసాగే అవకాశం లేని పరిస్థితి ఏర్పడినప్పుడు అది తప్పనిసరి అయిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవిని వదలలేక చివరకు ఒత్తిడి తట్టుకోలేక తలదించక తప్పలేదన్నారు సీఎం. ధైర్యసాహసాలతో తమ గళాన్ని వినిపించిన భారతీయ యువతకు నా అభినందనలు అని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో అక్రమాల ఆరోపణల తర్వాత దేశవ్యాప్తంగా ఊపందుకున్న విద్యార్థుల నిరసనలకు ప్రధాన్ నిష్క్రమణ ఒక విజయమని ఆయన పేర్కొన్నారు. వీధుల్లోకి వచ్చిన విద్యార్థులను అణచి వేయడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తప్పుకున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామం అని తెలిపారు.
విద్యార్థుల పక్షాన గట్టిగా నిలబడినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ , ఇతర పార్టీలకు ముఖ్యమంత్రి ప్రశంసించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన్‌ను కాపాడేందుకు ప్రధాని , బీజేపీ ప్రయత్నించాయని వీడీ సతీషన్ ఆరోపించారు, అయితే నిరసనల కారణంగానే ఆయన చివరకు “అవమానకర రీతిలో” రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ సతీశన్ ఇలా ప్రకటించారు. విద్యార్థి ఉద్యమాల శక్తి ముందు నియంతృత్వ శక్తులు తలవంచక తప్పలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేయడానికి, హింసను ప్రేరేపించడానికి, ప్రతిపక్ష నాయకులను వీధుల్లో ఈడ్చడానికి , ఎంపీలపై దాడి చేయడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు వినమ్రులయ్యారని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు మరియు జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. విద్యార్థుల సంకల్ప బలం కేంద్రం తలవంచేలా చేసింది. భారతీయ విద్యార్థి సమాజం యొక్క దృఢ నిశ్చయం ముందు కేంద్రం అహంకారం ఎట్టకేలకు తలవంచిందని ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ అన్నారు.
