అమరావతి : రైతుల సంక్షేమం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడటం జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయినా వారికి అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుతో చేతులు దులుపుకుని రైతులను మార్కెట్ కరుణకే వదిలేసిందని మండిపడ్డారు. రైతులకు శాశ్వత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడంలో, మార్కెట్‌లో సమర్థవంతంగా జోక్యం చేసుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాదిలోనే సుమారు 25 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును రూ.270 కోట్ల విలువతో కొనుగోలు చేసి వేలాది మంది రైతులకు అండగా నిలిచామని చెప్పారు. అలాగే ఎఫ్‌సీవీ (వర్జీనియా) పొగాకు రైతులను ఆదుకునేందుకు లో, ఆఫ్ స్టైల్ రకాల పొగాకుకు కిలోకు రూ.10ల ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సుమారు 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే కేంద్ర కార్యాచరణ కొనసాగుతోందన్నారు. రైతులకు మార్కెట్ భరోసాతో పాటు ఆర్థిక తోడ్పాటు కూడా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించేలా కేంద్ర వ్యవసాయ శాఖ, బీమా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా చర్చలు జరిపిందన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం సాధ్యమైందని చెప్పారు.
