డీఎంకే ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్ అరెస్ట్

న‌టి త్రిష కృష్ణ‌న్ పై అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఫైర్

చెన్నై : న‌టి త్రిష కృష్ణ‌న్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై పోలీసులు డీఎంకే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ పై కేసు న‌మోదైంది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జరిగిన ఆయన ర్యాలీలో నటి త్రిషను ఉద్దేశించి నినాదాలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనపై టీవీకే , బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఉదయనిధి న్యాయ బృందం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించగా, డీఎంకే దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా పేర్కొంటూ ఆయనకు మద్దతుగా నిలిచింది. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది.

ఒక బహిరంగ సభలో అనుచితమైన , ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు, తదనంతర ప్రజా ఆగ్రహం నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ను అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. కావేరీ జల వివాదంపై జరిగిన ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఉదయనిధి విమర్శిస్తుండగా, సభలోని కొందరు వ్యక్తులు నటి త్రిష పేరును గట్టిగా అరిచారు. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి, ఉదయనిధి చేసిన ఒక వ్యాఖ్య నటి త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించినట్లుగా భావించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. టీవీకే నేత ఆధవ్ అర్జున ఉదయనిధి భాషను తప్పుబడుతూ దుర్భాషలాడే నిధి అని ఎద్దేవా చేశారు. మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఏ బాధ్యతాయుతమైన నాయకుడైనా ఇలాంటి అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తారా అని టీవీకే ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ ప్రశ్నించారు.

బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతి కూడా ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవిగా పేర్కొంటూ ఉదయనిధిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ వివాదం తర్వాత, పోలీసులు కేసు నమోదు చేసి ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న సమయంలో విలేకరులతో మాట్లాడిన డీఎంకే నేత తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుగా ఏమీ అనలేదని, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ పేరు తప్ప మరెవరి పేరునూ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పోలీసు చర్య రాజకీయ కక్షసాధింపు అని ఆరోపిస్తూ ఉదయనిధి న్యాయ బృందం ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

Leave A Reply

Your Email Id will not be published!