టైగ‌ర్ ప్రాజెక్టులో పులి మృతిపై విచార‌ణ‌కు ఆదేశం

వ‌న్య ప్రాణుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్ లోని రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతం నా దృష్టికి వచ్చిందన్నారు. శ‌నివారం దీనిపై డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం అన్నారు. మన అడవులను, వన్య ప్రాణులను కాపాడు కోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. అది సహజ మరణమా? లేక వేటగాళ్ల దుశ్చర్య, విష ప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల‌ని స్ప‌ష్టం చేవారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాల‌న్నారు.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని అన్నారు. క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి జీవ వైవిధ్యాన్ని రక్షించు కోవడం మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉందని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!