హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు హైదరాబాద్ జేఎన్టీయూ బోధక, బోధనేతర సిబ్బంది అల్టిమేటం ఇచ్చింది. రిజిస్ట్రార్ మార్పు వ్యవహారం క్యాంపస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఉపకులపతి అధికారాల్లో ప్రభుత్వ జోక్యం తగదంటూ వర్సిటీ అధ్యాపక, సిబ్బంది వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. వర్సిటీ పరిధిలోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో అన్ని అనుబంధ కళాశాలలు, వివిధ విభాగాలకు చెందిన బోధక, బోధనేతర, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అత్యవసరంగా సమావేశం అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ‘స్టాండ్ విత్ వీసీ’ అనే నినాదంతో వీసీకి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విశ్వ విద్యాలయాల తరహాలోనే జేఎన్టీయూహెచ్‌లో కూడా కేవలం వీసీని మాత్రమే ప్రభుత్వం నియమిస్తుంది. వర్సిటీలోని ఇతర పరిపాలనా సంబంధమైన పోస్టులన్నింటినీ (ఉదాహరణకు రిజిస్ట్రార్) నియమించే అధికారం వీసీకే ఉంటుంది. కాబట్టి మున్ముందు కూడా అదే పద్ధతిని కొనసాగించాలి. వర్సిటీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని గౌరవించి, వీసీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. అనవసరంగా జోక్యం చేసుకుని వీసీని ఇబ్బందిపెడుతూ పాలనకు ఆటంకం కలిగించ కూడదని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
జేఎన్టీయూహెచ్ 54 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక బీసీ (వెనుకబడిన తరగతుల) మహిళకు రిజిస్ట్రార్‌గా అవకాశం దక్కింది. పైగా ఆమె ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు ప్రాంతానికి చెందిన బిడ్డ. ఇతర ఏ విశ్వ విద్యాలయాల్లోనూ ఇలా వెనుకబడిన తరగతుల మహిళకు అవకాశం కల్పించిన దాఖలాలు లేవు. ఇంతటి సాహసోపేతమైన, హర్షించదగ్గ నిర్ణయం తీసుకున్న వీసీ చర్యను స్వాగతించాల్సింది పోయి, కేవలం 45 రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆమెను తప్పించే ప్రయత్నం చేయడం సరికాదని, ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని వారు పేర్కొన్నారు. ఇంతకు ముందు పని చేసిన రిజిస్ట్రార్ తన రెండేళ్ల పూర్తి పదవీ కాలాన్ని ముగించుకుని, అదనంగా మరో నాలుగు నెలలు కూడా పనిచేశారు. వర్సిటీలో రిజిస్ట్రార్‌గా పని చేయాలని ప్రతి ఆచార్యుడూ కోరుకోవడం సహజం. గతంలో పాత రిజిస్ట్రార్లకు 2 నుంచి 4 ఏళ్ల పాటు అవకాశం కల్పించినట్లుగానే, ఇతర కొత్త ఆచార్యులకు వారి సీనియారిటీ, అర్హతలు, అనుభవం ఆధారంగానే వీసీ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ పద్ధతిలోనే రిజిస్ట్రార్‌ను నియమించారు కాబట్టి, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పెద్దలు, బ్యూరోక్రాట్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆమె పూర్తికాలం పదవిలో కొనసాగేలా సహకరించాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని, విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూహెచ్ ప్రతిష్ఠను కాపాడాలి. వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలనలో యథాతథ స్థితిని కొనసాగించాలి. తామందరం పూర్తిస్థాయిలో వీసీ వెంటే ఉన్నామని, తీసుకునే ప్రతి నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని సిబ్బంది స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీసీకి సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ తమ విజ్ఞప్తిని బుట్ట దాఖలు చేస్తే.. పరిపాలనా పోస్టుల్లో ఉన్న వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని జేఎన్టీయూహెచ్ బోధక, బోధనేతర సిబ్బంది తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
