గోదావ‌ర‌మ్మ ఉగ్రరూపం జ‌ర భ‌ద్రం :పొంగులేటి

తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయండి

హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాక‌రతో టెలిఫోన్‌లో మాట్లాడారు. గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్న దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశించారు. అలాగే ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కూడా భాగ‌స్వాములుగా చేయాల‌ని సూచించారు.

ప్రజల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రాజెక్టుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంత ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్ప‌ష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చినందున మూడ‌వ ప్ర‌మాద‌హెచ్చ‌రిక జారీ చేశామ‌ని, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో నీటి మట్టం మధ్యాహ్నానికి ఏకంగా 48 అడుగులకు చేరుకుంద‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు. 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామ‌ని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!