రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌

భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా ప్రజెంట్

అమరావతి : విభజన నాటి కంటే 2019-24 మధ్యన జరిగిన విధ్వంసం వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్ట పోయిందని, ఈ సమస్యను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నడూ పడనంత కష్టాన్ని గత రెండేళ్లల్లో పడ్డానని తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని మొత్తంగా గాడిలో పెట్టేశామని చెప్పడంలేదన్న సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేలా పోయిన బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేశామన్నారు. ఆర్థిక వెసులుబాటు లేకున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు ప్రజలకూ తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో రెండేళ్ల ఆర్థిక స్థితిగతులపై సీఎం ప్రొగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేశారు. 2019–24 మధ్య రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలు, అధికారులు, ఉద్యోగులు భయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పాలనపై ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే 2024 ఎన్నికల ఫలితాలని చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, బ్రాండ్‌ ఏపీని తిరిగి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. చెప్పిన విధంగా ఇచ్చిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, కొత్త రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఆ మేరకు కొత్త పాలసీలు తెస్తుందని సీఎం వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!