న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఎంపీలు, మంత్రితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల గురించి ఏకరువు పెట్టారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు విన్నవించారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్‌శక్తి శాఖకు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని ప్రస్తావించారు సీఎం. 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మాణంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించిందని కేంద్ర మంత్రికి వివరించారు.
CWPRS అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినపెద్దగా తేడా లేదని స్పష్టమైందని తెలిపారు. ముంపులో 50 శాతం నదీ గర్భం (రివర్ బెడ్)లోనే ఉంటుందని చెప్పారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా అవసరమైన నీటి సరఫరా సాధ్యం కాదని, అందువల్ల 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ని ముఖ్యమంత్రి కోరారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా వల్ల విద్యుత్ వినియోగ భారం తగ్గుతుందని అన్నారు.
ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వసతి ఏర్పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా పీఎం కార్యాలయం నుంచి లేఖ అందిందని జల్‌శక్తి మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
