సింగ‌రేణి బ‌లోపేతానికి ఆధునిక మైనింగ్ టెక్నాల‌జీ

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

అమెరికా : ఉప ముఖ్య‌మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మైనింగ్ యంత్రాల తయారీ సంస్థలైన అరిజోనా రాష్ట్రంలోని ‘కేటర్పిల్లర్ డెమాన్‌స్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్’, టెక్సాస్ రాష్ట్రంలోని ‘కొమాట్సు మైనింగ్ కార్పొరేషన్’ కేంద్రాలను సందర్శించారు. ప్రపంచ స్థాయి భారీ మైనింగ్ యంత్రాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియలను, స్వయంచాలిత , టెలి-రిమోట్ ఆపరేషన్ టెక్నాలజీలను, అత్యాధునిక భద్రతా వ్యవస్థలను డిప్యూటీ సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. గనుల్లో ప్రమాదాలను తగ్గించి కార్మికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.

అదేవిధంగా భారీ మైనింగ్ యంత్రాల నిర్వహణ, స్పేర్ పార్ట్స్ లభ్యత, మెయింటెనెన్స్ ఖర్చుల తగ్గింపు, సాంకేతిక సహకారం, భవిష్యత్‌లో సింగరేణి అవసరాలకు అనుగుణంగా ఆధునిక యంత్రాల కొనుగోలు, ఫ్లీట్ విస్తరణ, స్థానిక సర్వీస్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల సింగరేణి దక్కించుకున్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్-2, మణుగూరు PKOC-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాకుల అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ, భారీ యంత్రాల ఎంపిక, ఆటోమేషన్ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయడంలో ఈ పర్యటన కీలకంగా నిలవనుంది.

సింగరేణి గనుల్లో ప్రపంచ స్థాయి సాంకేతికతను ప్రవేశపెట్టి కార్మికుల భద్రతను మరింత మెరుగు పరచడం, ఉత్పాదకతను పెంచడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక మైనింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకు రావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!