హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారుల నెట్ వర్క్ ను ఒకే సిస్టమ్ లోకి తీసుకు రావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ డి బోధి పెవిలియన్ లో హెచ్ఎండిఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం కీలక సూచనలు చేశారు. అన్ని రోడ్ నెట్ వర్క్ లను ఒకే విధానంలోకి తీసుకు రావాలని సూచించారు. భూ సేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ తో అన్ని అంశాలు ఈ సిస్టం లోకి వచ్చేలా చూడాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు,రీజినల్ రింగ్ రోడ్డు లు, నగరం లోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు , ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధి లోకి తక్షణమే తీసుకు రావాలన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడిక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. ఇదే క్రమంలో టీడీఆర్ పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలన్నారు .టీడీఆర్ ప్రక్రియ ను మొత్తం ఆన్ లైన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థ ను రూపొందించాలని స్పష్టం చేశారు.
రేడియల్ రోడ్డు ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ 1 ను డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. రోడ్ల నిర్మాణం లో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. నాణ్యత లో రాజీ పడకూడదన్నారు. భవిష్యత్ లో ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణం లో వాడే మట్టి పైన జాగ్రత లు తీసుకోవాలని సూచించారు. రోడ్ లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా చూడాలన్నారు. బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకం అన్నారు సీఎం. ఎలేవేటెడ్ కారిడార్స్ 1,11 పనులు వేగవంతం చేయాలి.
