ప్రపంచ స్థాయి వేదికపై మెరిసిన తెలంగాణ ఆర్టీసీ

కన్వీనర్ హోదాలో పాల్గొన్న ఎండీ వై.నాగిరెడ్డి

హైద‌రాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పర్యావరణ అనుకూల, అధునాతన సాంకేతిక ఆధారిత బస్సు రవాణా వ్యవస్థను రూపొందించే ప్రధాన లక్ష్యంతో ఢిల్లీలో ఇండియా బస్ కాన్ఫరెన్స్ 2026’ ను రెండు రోజుల పాటు నిర్వహించారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ చెల్లింపులపై ఈ అంతర్జాతీయ సదస్సు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించింది ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి కన్వీనర్ హోదాలో హాజరై ప్రసంగించారు .టీజీఎస్ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు సంస్థను ఆర్థికంగా, నిర్వహణాపరంగా బలోపేతం చేసేందుకు చేపడుతున్న విప్లవాత్మక నిర్ణయాలను ఏండీ తన సమగ్ర ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సురక్షితమైన డిజిటల్ సేవలు అందించడం, క్షేత్రస్థాయిలో రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు సంస్థ చేపడుతున్న ఆధునిక సంస్కరణలను ప్రపంచ స్థాయి ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, విధాన రూపకర్తలు , నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి బస్సుల నిర్వహణ, ఆర్థిక సవాళ్లు, సబ్సిడీలు , ప్రభుత్వాల మద్దతుపై లోతుగా చర్చించారు. పరిశ్రమల అధినేతలు, అంతర్జాతీయ నిపుణులు ,స్టార్టప్ ప్రతినిధులు పాల్గొని స్మార్ట్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత , భవిష్యత్తు రవాణా నమూనాలను వివరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ట్రాఫిక్ వేళలను ముందే ఊహించి బస్సులను నడిపే ప్రిడిక్టివ్ మొబిలిటీ పద్ధతులను ఈ సమావేశంలో నిపుణులు ప్రతిపాదించారు. ‘నెట్-జీరో’ కార్బన్ ఉద్గారాల లక్ష్య సాధనలో భాగంగా 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టడం, వీటి కోసం గ్రీన్ బాండ్లు , దీర్ఘకాలిక తక్కువ వడ్డీ రుణాల ద్వారా నిధులు సమకూర్చడంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రయాణికులకు వై-ఫై, డిజిటల్ టికెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు మెట్రో, బస్సు, ఆటో సేవలను ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (NCMC) , MaaS 2.0 యాప్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారు

Leave A Reply

Your Email Id will not be published!