భక్తులను మోసం చేసిన సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చీటింగ్
తిరుపతి : భక్తులను మోసం చేసిన కేసులో సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడిని తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ గా గుర్తించారు. ఇతను టీటీడీ కార్యాలయంలో సబార్డినేట్ (క్లాస్–4) ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. తాను టీటీడీలో పేష్కార్‌గా పని చేస్తున్నానని, తన పలుకుబడితో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను నమ్మించాడు. భక్తులకు నమ్మకం కలిగించేందుకు తన టీటీడీ గుర్తింపు కార్డు ప్రతిని కూడా పంపేవాడు.
ఈ క్రమంలో ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడిని నమ్మించి, నిందితుడి ఫోన్‌పే నంబర్‌కు పలు విడతల్లో రూ.1,56,000/- నగదు బదిలీ చేయించుకున్నాడు. 24 మే నెలలో టికెట్ల కోసం భక్తులు తిరుమల ఎస్‌ఎంసీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో నిందితుడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో, శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి భక్తుల నుంచి నగదు తీసుకోవడంతో పాటు, తిరుపతికి చెందిన మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3,60,000/- తీసుకుని మోసం చేసినట్లు కూడా వెల్లడించాడు. దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు వివిధ సందర్భాల్లో మొత్తం సుమారు రూ.10,00,000/- మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా కేసు వివరాలు, నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
