రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్
సంచలన వ్యాఖ్యలు చేసిన గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఏకి పారేశారు. గతంలో పాలించిన కేసీఆర్ సర్కార్, ఇప్పుడు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణకు కేంద్రం రైల్వే శాఖా పరంగా భారీ ఎత్తున నిధులు కేటాయించిందని చెప్పారు. ఏకంగా . రూ. 80,000 కోట్ల రైల్వే ప్రణాళికలను ప్లాన్ చేసిందన్నారు. ఇదే క్రమంలో అప్పుల విషయంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణను రూ. 13 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, రాష్ట్రాన్ని కమిషన్ రాజ్ గా మార్చాయని సంచలన ఆరోపణలు చేశారు. తాండూరు, వికారాబాద్ పర్యటనల సందర్భంగా ఈ ప్రాంతం కోసం కేంద్రం రూపొందించిన భారీ రైల్వే ప్రణాళికలను కూడా ఆయన వివరించారు.
తాండూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు కుటుంబ దోపిడీని చూశారని, ఇప్పుడు రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, నిర్మాణ పనులపై 30 శాతం కమిషన్ రేటు నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ ఇప్పుడు రూ. 13 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూ సతమతమవుతోందని అన్నారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వారి పదవీ విరమణ ప్రయోజనాలు దక్కని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే రాష్ట్రం ఈ దుస్థితికి చేరింది అని వాపోయారు. సుపరిపాలన అందించేందుకు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఇదే సమయంలో ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై కూడా విరుచుకు పడ్డారు కిషన్ రెడ్డి.
