చెన్నై : తమిళనాడు సర్కార్ కీలక ముందడుగు వేసింది. సీఎం విజయ్ సారథ్యంలో పలు కీలక ఒప్పందాలు వివిధ సంస్థలతో చేసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు చేసుకోవడం విశేషం. లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ ఎంఓయులు చేసుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మే నెలలో ‘తమిళగ వెట్రి కళగం’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి వెట్రి తమిళనాడు ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ 2026లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇందులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ , పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన పాల్గొన్నారు. విజయ్ సమక్షంలో తమిళనాడు ప్రభుత్వం రూ. 67,000 కోట్లకు పైగా విలువైన 97 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇది ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాధించిన ఒక కీలక పెట్టుబడి మైలురాయి అని చెప్పక తప్పదు.
పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందాలలో ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధనం, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, పరిశోధన , అభివృద్ధి , డేటా సెంటర్ల వంటి రంగాలలో లక్ష మందికి పైగా ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. హిందుజా, స్కైరూట్ ఏరోస్పేస్, ఇతర 95 సంస్థలు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.మా వద్ద గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా ప్రారంభమయ్యేవి) బ్రౌన్ ఫీల్డ్ (ఇప్పటికే ఉనికిలో ఉండి విస్తరించేవి) పెట్టుబడుల కలయిక బలంగా ఉంది. ఇందులో మొదటిసారిగా తమిళనాడును ఎంచుకుంటున్న కొత్త పెట్టుబడిదారులు, అలాగే రాష్ట్రంలోని మా మానవ వనరులు , మౌలిక సదుపాయాలను అనుభవించి, తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి చూపే సంస్థలు ఉన్నాయి అని మంత్రి కీర్తన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే మొత్తం పెట్టుబడి హామీలు రూ. లక్ష కోట్లను దాటనున్నాయి. తద్వారా 1.20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. అధికారంలో ఉన్న ప్రతి రోజుకు సగటున రూ. 1,000 కోట్ల పెట్టుబడి హామీ లభించింది. కొందరు దీనిని ఒక కీలక మైలురాయిగా అభివర్ణించవచ్చు, కానీ మాకు ఈ సంఖ్య మొత్తం కథనంలో ఒక చిన్న భాగం మాత్రమే. మా పాలనపై మీకున్న నమ్మకమే అసలైన ముఖ్యమైన విషయం అని ఆమె పెట్టుబడిదారులతో అన్నారు.
