అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు వంతెనను గురువారం ప్రారంభించారు. 60 మీటర్ల వెడల్పు, తొమ్మిది లేన్లతో కూడిన ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు . ఇందులో ప్రత్యేక బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ , సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. గుంటూరు జిల్లాలో ‘గ్రీన్ ఫీల్డ్’ రాజధాని నగరానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేలా దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీఎం. రూ. 1,520 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 22 కిలోమీటర్ల రహదారి అమరావతిలోని దొండపాడు గ్రామం నుండి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి , తాడేపల్లి గ్రామాల మీదుగా వెళ్లి జాతీయ రహదారి 16 ను కలుపుతుంది. 60 మీటర్ల వెడల్పు తొమ్మిది లేన్లతో కూడిన ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు.
రహదారి నిర్మాణంతో పాటు డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్ , విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా ఇందులో అంతర్భాగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్‌లు, ‘గ్రీన్ బెల్ట్’ వంటివి కూడా ఉన్నాయి. ఈ రహదారిని విజయవాడ-మంగళగిరి హైవేతో అనుసంధానించడానికి ఉండవల్లి గ్రామంలోని బకింగ్‌హామ్ కాలువపై 478 మీటర్ల పొడవు, నాలుగు లేన్ల స్టీల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెన, రహదారి నిర్మాణం ప్రారంభోత్సవంతో విజయవాడ నుండి రాజధాని నగరానికి రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది; అలాగే కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రస్తుతం ఇరుకుగా ఉండే ‘కరకట్ట’ రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అమరావతిలో, N1 రోడ్డు నుండి N17 రోడ్డు వరకు గ్రిడ్ పద్ధతిలో మొత్తం 350 కిలోమీటర్ల మేర 34 రహదారులను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటన్నింటినీ E3 రహదారి అనుసంధానిస్తుంది. అనవసరమైన మలుపులను తొలగిస్తూ, భవిష్యత్తులో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, కొత్తగా నిర్మితమవుతున్న రాజధాని నగరానికి సులభంగా చేరుకునేలా ప్రభుత్వం రహదారి వ్యవస్థను నిర్మిస్తోంది.
