హైదరాబాద్ : మహిళలు, చిన్నారుల సంక్షేమానికి విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాల సాధనలో టీజీఎస్పీడీసీఎల్ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయాలు కల్పించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధి , మహిళల సంక్షేమానికి మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో, మహిళా ,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అమలైంది. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను సాకారం చేయడంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విద్యుదీకరణ పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. డీఏ-జీజీయూఏ పథకం కింద టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 9,234 విద్యుదీకరణ లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించారు. వీటిలో 257 కేంద్రాలు విద్యుదీకరణ అవసరం లేని, విలీనం చేయబడిన లేదా గుర్తించలేని కేంద్రాలుగా తేలగా, మిగిలిన 8,977 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు విడుదల చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించారు.
ఈ కార్యక్రమం రెండు దశల్లో అమలైంది. ఫేజ్-Iలో గుర్తించిన 7,297 అంగన్వాడీ కేంద్రాల్లో 7,073 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయగా, ఈ దశ జూలై 2026లో పూర్తయింది. అలాగే ఫేజ్-IIలో గుర్తించిన 1,937 కేంద్రాల్లో 1,904 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయగా, ఈ దశ 10 ఆగస్టు 2026 నాటికి పూర్తయింది. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి, గర్భిణీలు , బాలింతల సంక్షేమానికి అత్యంత కీలకమైన సంస్థలు. ఈ కేంద్రాల్లో విద్యుత్ సదుపాయాలు కల్పించడం ద్వారా మెరుగైన విద్యా, ఆరోగ్య , పోషణ సేవలను అందించే అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. విద్యుత్ అందుబాటులో ఉండటం వల్ల అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది అని తెలిపారు.
ఈ లక్ష్యాన్ని సాధించడంలో క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్ సిబ్బంది , ఉద్యోగులందరికీ నా ప్రత్యేక అభినందనలు. వారి కృషి, నిబద్ధత వల్లే నిర్ణీత గడువులో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామని కొనియాడారు. అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణతో చిన్నారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం, గర్భిణీలు , బాలింతలకు మెరుగైన సేవలు, అంగన్వాడీ సిబ్బందికి మెరుగైన పని వాతావరణం అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా, శిశు సంక్షేమ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
