అమరావతి : : సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ – మంగళగిరి – గుంటూరులతో కలిపే కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటి ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌లతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాయపూడి నుంచి వెంకటపాలెం- పెనుమాక మీదుగా ఉండవల్లి వరకూ సీడ్ యాక్సెస్ రహదారిని సీఆర్డీఏ నిర్మించింది. స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించటంతో రాజధాని నగరానికి మెరుగైన కనెక్టివిటీ వచ్చినట్టైంది. మూడో దశలో మణిపాల్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ప్రణాళిక చేశారు. దీనికి రూ.1,519 కోట్ల వ్యయం కానుంది. స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రహదారిని సీఎం కాలినడకన తిరిగి ఆసాంతం పరిశీలించారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విజన్‌కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం జరిగింది. విభజన తర్వాత రాష్ట్రం నష్ట పోయింది. రాజధాని కూడా లేకుండా పోయింది. 25 పార్లమెంటు స్థానాల్లో మధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టాలని ఆనాడు సంకల్పించాం. విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. రైతులది త్యాగం కాదు స్పూర్తి. సింగపూర్ అమరావతి బృహత్ ప్రణాళికను ఉచితంగా ఇచ్చి సహకరించింది. గత పాలకులు ప్రజలతో పాటు సింగపూర్ ప్రతినిధులను కూడా వేధింపులకు గురి చేశారు. ప్రభుత్వ కాంప్లెక్సు భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించాం. కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారు. ఆ గ్రాఫిక్స్ నిజం అవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తలలు దించుకోవాలి. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి వికేంద్రీకరించేలా ప్రణాళికలు చేశాం. అసెంబ్లీలో రాజధాని 40 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి తర్వాత మూడు రాజధానులని మాట తిప్పేశాడు. 2019-24 మద్య రైతుల ఉద్యమాన్ని చరిత్ర మర్చిపోదు. అమరావతితో పాటు రాష్ట్రం అంతటా అభివృద్ధి కావాలన్నదే నా ఆకాంక్ష. అమరావతిని ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
