బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీపై. రైతుల సంక్షేమం విషయం గురించి ప్రశ్నించడం , నిలదీయడం, ఆందోళనలు చేపట్టడం దారుణమన్నారు. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఒక్క పథకాన్ని కూడా గతంలో ఏలిన సర్కార్ ప్రవేశపెట్టలేదని ఆయన ఆరోపించారు. ఇవాళ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు బీజేపీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. వారు మరో నాలుగు పాదయాత్రలు చేసినా సరే, కానీ ముందుగా బీజేపీ తన పాలనా కాలంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని ఆయన అన్నారు. పవిత్రమైన కూడల సంగమాన్ని సందర్శించి, అక్కడ సంగమ వద్ద పూజలు చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.
అలాగే దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘ప్రజా సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. ‘ప్రజా సేవ’ కార్యక్రమం ప్రారంభం కానుంది, రోజంతా ప్రజల సమస్యలను నేను స్వయంగా వింటాను అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ‘ప్రజా సేవ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియ జేసేలా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వమే నేరుగా వారి ముంగిటకు వెళ్లేలా ఒక కొత్త పని విధానాన్ని రూపొందిస్తున్నాం అని ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నెలకు రెండు శనివారాల పాటు ప్రజల సమస్యలను వినేలా ఒక వ్యవస్థను ప్రవేశ పెట్టబోతున్నాం అని ఆయన అన్నారు.
