ప్ర‌ధాని అభ్య‌ర్థిగా విజ‌య్ అంశంపై నో కామెంట్

మాట్లాడేందుకు నిరాక‌రించిన సెంగోట్టియ‌న్

చెన్నై: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్ర‌శేఖ‌ర్ ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడంపై వచ్చిన ప్రశ్నలకు రెవెన్యూ శాఖ మంత్రి కె.ఎ. సెంగోట్టయన్ స్పందించేందుకు నిరాక‌రించారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్లిష్ట‌మైన , అత్యంత ప్రాధాన్య‌త‌, వివాదాస్పదం అయ్యే ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌ద్ద‌ని, ద‌య‌చేసి త‌న‌ను ఇబ్బంది పెట్ట‌వద్దంటూ కోరారు మీడియాను. కోయంబత్తూర్‌కు బయలుదేరే ముందు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మంత్రులతో సహా ‘తమిళగ వెట్రి కళగం’ సభ్యులు విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని చేస్తున్న డిమాండ్ల గురించి ఆయనను అడిగారు.ప్ర‌స్తుతం దేశంలోనే అత్యంత నిబ‌ద్ద‌త‌తో ప్ర‌జ‌ల కోసం , వారి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి త‌మ నాయ‌కుడ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఆ ప్రశ్నకు స్పందిస్తూ సెంగోట్టియ‌న్ సీఎం విజయ్ అభివృద్ధిపై దృష్టి సారించి తమిళనాడును నడిపిస్తున్నారని, రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాధించాలని కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని ఆ పార్టీ వాదిస్తోందన్న విషయంపై సెంగోట్టియ‌న్ ను ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఏమిటో నేను స్పష్టంగా వివరించాను. దయచేసి మరో ప్రశ్న అడిగి నన్ను ఇబ్బందుల్లోకి నెట్టవద్దంటూ కోరారు. ఆ తర్వాత మంత్రి తదుపరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించి అక్కడి నుండి వెళ్లిపోయారు. తమిళనాడు దాటి విజయ్‌ను జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టాలనే అంశంపై అధికార టీవీకేలో రాజకీయ చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!