న్యూఢిల్లీ : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సెప్టెంబర్ 26న ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించనున్నారు. విడుదలైన సవరించిన తాత్కాలిక వక్తల జాబితా ప్రకారం మధ్యాహ్న సమయంలో జరిగే జనరల్ డిబేట్ లో పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 81వ సమావేశం సెప్టెంబర్ 8న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుండి 28 వరకు జరిగే సాధారణ చర్చలో ప్రపంచ నాయకులు 193 సభ్య దేశాలు కలిగిన ఈ సంస్థను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్యసమితి వేదిక నుండి ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే సాధారణ చర్చలో బ్రెజిల్ సంప్రదాయం ప్రకారం మొదటి వక్తగా ఉంటుంది,. ఆ తర్వాత అమెరికా వక్తగా ఉంటుంది. ఏడాది పాటు సాగే ఈ 81వ సమావేశానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ అధ్యక్షత వహిస్తారు. 193 సభ్య దేశాలు కలిగిన ఈ సంస్థకు నాయకత్వం వహించడానికి ఆయన జూన్‌లో ఎన్నికయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 22న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదిక నుండి ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు; వైట్ హౌస్‌లో తన రెండవ పదవీ కాలంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో తను ప్రసంగించడం ఇది రెండవసారి కావడం విశేషం. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలలో అత్యంత రద్దీగా ఉండే దౌత్యపరమైన కాలంగా పరిగణించబడే ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ ఏడాది సమావేశం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నెలల తరబడి సాగుతున్న ఘర్షణలు ‘గ్లోబల్ సౌత్’ దేశాలపై ,అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
