ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు

మాన్‌సూన్ సమావేశాలు ముగిసే వరకు

న్యూఢిల్లీ : మహిళా సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని మాన్‌సూన్ సమావేశాలు ముగిసే వరకు లోక్‌సభ సస్పెండ్ చేసింది. స్పీకర్‌కు సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాన్‌సూన్ సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు, ఆ వ్యాఖ్యలు సభ గౌరవానికి భంగం కలిగించాయని చైర్‌లో ఉన్న కృష్ణ ప్రసాద్ తెన్నేటి పేర్కొన్నారు. అనంతరం సస్పెన్షన్ కోరుతూ రూపొందించిన తీర్మానాన్ని చదివి వినిపించాలని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను కోరారు. నీట్ పేపర్ లీక్ , ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ‘వాయిస్ ఓట్’ ద్వారా ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లాలని బెనర్జీని తెన్నేటి ఆదేశించారు.

అనంతరం ఆ రోజుకు సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ వాయిదా పడిన సమయంలో, లోక్‌సభ చాంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ సభ్యుల బృందమైన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ కి చెందిన కొందరు ఎంపీలతో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదంలో మితాలి బాగ్, శతాబ్ది రాయ్ , కాకోలి ఘోష్ దస్తీదార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాగ్వాదానికి గల కారణం వెంటనే స్పష్టం కాలేదు. పరిస్థితిని సద్దు మణిగించేందుకు అధికార, ప్రతిపక్ష బెంచీల నుంచి కొందరు సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత బెనర్జీ సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అనంతరం, ఈ అంశాన్ని లేవనెత్తేందుకు మితాలి బాగ్, డాక్టర్ దస్తీదార్, ఇతర NCPI సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్‌లో కలిశారు.

Leave A Reply

Your Email Id will not be published!