అమరావతి : పొగాకు రైతుల సంక్షేమం కోసం నిజంగా పని చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రమేనని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఏమాత్రం తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. జగన్ హయాంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయినా స్పందించ లేదని, చేసిన కొనుగోళ్లు కూడా కేవలం కంటితుడుపు చర్యలుగా మాత్రమే మిగిలి పోయాయని మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించు కోకుండా ఐదేళ్లు గడిపిన జగన్ ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకున్నామని మంత్రి గుర్తు చేశారు.
2014-15 పంట సీజన్‌లో పొగాకు కిలోకు రూ.20 చొప్పున ధరల పరిహారం అందించామని తెలిపారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు అచ్చెన్నాయుడు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయటం తప్పా , రైతులకు నిజమైన ఉపశమనం కలిగించే విధంగా మార్కెట్‌లో సమర్థవంతమైన జోక్యం చేయలేక పోయిందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గత ఏడాదిలోనే సుమారు 35 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును రూ.300 కోట్ల విలువతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.
