చెన్నై : సూపర్ స్టార్ , తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సంచలనంగా మారారు. పాలనా పరంగా పరుగులు తీయిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటూ సెన్సేసన్ క్రియేట్ చేస్తున్న ఈ నటుడు నటించిన తాజా చిత్రం జన నాయగన్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన టీ షర్ట్స్ కు యమ క్రేజ్ ఏర్పడింది. ఈ టీ షర్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక. నెలల తరబడి సాగిన న్యాయపరమైన పోరాటాలు, ఆన్‌లైన్ లీక్ , సెన్సార్ బోర్డుతో బహిరంగ వివాదం వంటి సవాళ్లను అధిగమించి, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జన నాయగన్ చిత్రం ఎట్టకేలకు జూలై 23న విడుదల కానుంది. . జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల దగ్గర పడుతుండటంతో, వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన తిరుపూర్‌లోని తయారీ యూనిట్లు అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్ట్ల డిమాండ్‌ను తీర్చడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి.
సినిమా గ్రాండ్ థియేటర్ విడుదలను పురస్కరించుకుని, నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ చిత్రం సినిమా బ్రాండింగ్‌తో కూడిన టీ-షర్ట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు భారీగా ఆర్డర్లు ఇస్తుండటంతో ఉత్పత్తి ఊపందుకుంది. కొద్ది రోజుల క్రితం సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి, తిరుపూర్‌లోని వస్త్ర తయారీ యూనిట్లు ‘జన నాయగన్’ టీ-షర్ట్లను తయారు చేయడానికి అదనపు సమయం కేటాయిస్తూ పని చేస్తున్నాయి అని తిరుపూర్ టెక్స్‌టైల్ యూనిట్ అసోసియేషన్ సభ్యుడు కె. ప్రభాకరన్ తెలిపారు. సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, 700కు పైగా నిట్‌వేర్ యూనిట్లు టీ-షర్ట్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, చాలా స్థానిక తయారీదారులు తమిళనాడు అంతటా కొరియర్ సేవలు , క్యాష్-ఆన్-డెలివరీ సదుపాయాలను అందిస్తున్నారు.
తమిళనాడు నుండే కాకుండా కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆర్డర్లు వెల్లు వెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ టీ-షర్ట్లపై సీఎం విజయ్ ఆకర్షణీయమైన చిత్రాలు , సినిమా పేరు ముద్రించబడి ఉన్నాయి; చాలా ఆర్డర్లలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కీర్తించే నినాదాలు కూడా ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు గడువులోగా ఆర్డర్లను పూర్తి చేయడానికి ప్రింటర్లు రెట్టింపు షిఫ్టులలో పనిచేస్తున్నారు.