ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను వన్డే ఫార్మాట్ లో కంటిన్యూ చేయాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడా. అవుననే సమాధానం వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి. తాజాగా ఎంపిక చేసిన వన్డే జట్టుకు శాంసన్ పేరు పరిగణలోకి వచ్చినా ఎందుకనో మొదటి నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఇండియాలో ఈ ఏడాది 2026లో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను ఇండియా, శ్రీలంక నిర్వహించింది. అనుకోకుండా జట్టులోకి వచ్చిన శాంసన్ సంచలనంగా మారాడు. కేవలం తను ఆడడం వల్లనే భారత జట్టు రెండోసారి టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.
తను కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై 97 రన్స్ చేశాడు. ముంబై వేదికగా జరిగిన సెమీస్ లో 89 రన్స్ చేశాడు. ఇక అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సైతం సత్తా చాటాడు. 89 పరుగులు చేసి జట్టుకు వెన్నుముకగా మారాడు. టి20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు స్వంతం చేసుకున్నాడు. గతంలో వన్డే ఫార్మాట్ లో కూడా అద్భుతంగా ఆడాడు. కానీ తనను కావాలని పక్కన పెడుతూ వచ్చారు. దీంతో గంభీర్ , అగార్కర్ లపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువత్తాయి. టి20 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ 19వ సీజన్ లో సైతం సత్తాచాటాడు. రెండు సెంచరీలు కూడా చేశాడు. దీంతో తనను కూడా వన్డే జట్టులోకి తీసుకోవాలని ఈ మధ్యన హెడ్ కోచ్ సూచించినట్లు టాక్.
