త‌మిళ‌నాడులో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి బ్రేక్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా తీపి క‌బురు చెప్పారు. అడ్డ‌గోలు ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి బ్రేక్ వేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త శకం నడుస్తోంది. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇప్పుడు విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం మరొక చారిత్రాత్మకమైన సంస్కరణను తెరపైకి తెచ్చింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గల విద్యార్థులందరికీ శారీరక విద్యను విధిగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నేటి ఆధునిక కాలంలో పుస్తకాల మోతతో, ర్యాంకుల వేటలో నలిగి పోతున్న బాల్యానికి ఈ నిర్ణయం సరికొత్త ఊపిరి పోస్తుందని చెప్పవచ్చు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని భావించిన ముఖ్యమంత్రి విజయ్, ఈ కొత్త పాలసీ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి బలమైన పునాది వేశారు. ప్రభుత్వం కేవలం మార్కుల కోసమే విద్య అన్న సంప్రదాయ ధోరణిని పూర్తిగా మార్చేయాలని సంకల్పించినట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలై శారీరక శ్రమను మరిచిపోతున్న నేటి తరాన్ని మైదానాల వైపు నడిపించడం చాలా అవసరంగా మారింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యా శాఖ, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతిరోజూ క్రీడలు లేదా శారీరక శ్రమకు సంబంధించిన పీరియడ్‌ను ఖచ్చితంగా కేటాయించాలని స్పష్టం చేసింది. దీనివల్ల విద్యార్థుల్లో స్థూలకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తగ్గి, వారిలో ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహాయింపు లేదని ప్రకటించడం ద్వారా అందరికీ సమాన ప్రాధాన్యత కల్పించారు. ఒకపక్క కార్పొరేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టం చేస్తూనే, మరోపక్క ఇలాంటి వినూత్న విద్యా విధానాన్ని తీసుకు రావడం నిజంగా అభినంద‌నీయం.

Leave A Reply

Your Email Id will not be published!