ముంబై : నీట్ పేపర్ లీక్ కావడాన్ని నిరసిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ రాజధానిలో సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దాడులకు దిగడం, అరెస్ట్ చేయడాన్ని పలువురు తప్పు పట్టారు. తాజాగా విద్యార్థుల నిరసనపై సంజన గణేశన్, దేవిషా శెట్టి స్పందించడం సంచలనం కలిగించింది. ఈ ఇద్దరూ భారత క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా , సూర్యకుమార్ యాదవ్ భార్యలు కావడం ఇప్పుడు చర్చకు దారితీసేలా చేసింది. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసన గురించి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పంచుకున్న పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.
టియర్ గ్యాస్ (బాష్ప వాయువు) ప్రభావానికి గురైన ఆరేళ్ల చిన్నారి పరిస్థితి పట్ల సంజన గణేశన్ విచారం వ్యక్తం చేశారు. తమను రక్షించాల్సిన వారిని చూసి శాంతియుత పౌరులు భయపడాల్సిన పరిస్థితి ఉండ కూడదని ఆమె అన్నారు. నిరసన జరుగుతున్న ప్రదేశానికి దూరంగా కూర్చున్న ఆరేళ్ల చిన్నారికి ఇలా జరిగిందంటే, ఇది ఎవరికైనా జరగవచ్చు. టియర్ గ్యాస్ వల్ల పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బంది పడటాన్ని ఏ ప్రజాస్వామ్యమూ సాధారణ విషయంగా పరిగణించ కూడదు. తమను రక్షించాల్సిన వారిని చూసి ఏ శాంతియుత పౌరుడూ భయపడాల్సిన అవసరం రాకూడదని పేర్కొన్నారు.
ఇక నిరసన తెలుపుతున్న విద్యార్థుల పట్ల దేవిషా శెట్టి సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ, హింసను మాత్రం ఖండించారు. దీన్ని ‘ప్రేరేపితం’ అనండి, ‘రాజకీయ ప్రేరేపితం’ అనండి, ‘పక్షపాతపూరితం’ అనండి లేదా ‘కలుషితం’ అనండి… ఏ పేరుతో పిలిచినా, తమ గళాన్ని వినిపించేందుకు యువ భారతీయులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారన్న వాస్తవం మారదు. ఇప్పుడు మనం రక్షణ ధోరణిని వీడి, సమస్యపై మరింతగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. వీరు యువ భారతీయ పౌరులు. నిరసనను నిర్వహించడం పోలీసులకు సాధ్యం కావాలి. వారు అక్కడకు రావడానికి గల కారణాలను ప్రభుత్వం వినాలి అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
