ముంబై : బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి డింపుల్ హయతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మహిళల పాత్రలపై చర్చ ఎప్పుడో జరిగి ఉండాల్సింది అని పేర్కొన్నారు. ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తనను కేవలం అందాలను ఆరబోసేందుకే వాడుకున్నారని , ఆమెకు ప్రాధాన్యత లేకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి దర్శకుడి తీరుపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ చెలరేగిన వివాదం నేపథ్యంలో ప్రధాన స్రవంతి సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యంపై జరుగుతున్న చర్చలో యువ నటి డింపుల్ హయతి కూడా భాగమయ్యారు. ఆ సినిమా పేరును నేరుగా ప్రస్తావించకుండానే, తెరపై పాత్రలను ఎలా రాస్తారు లేదా ఎలా చూపిస్తారు అనే విషయంలో నటీమణులకు పెద్దగా ప్రమేయం ఉండదని బాంబు పేల్చారు.
అయినప్పటికీ వారు పోషించే పాత్రల విషయంలో వారిని తరచుగా అన్యాయంగా విమర్శిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ చర్చను ఆమె స్వాగతించారు. ఇది చిత్ర పరిశ్రమలో “ఎప్పుడో జరిగి ఉండాల్సిన” చర్చ అని అభివర్ణించారు. ఒక మహిళా పాత్ర లోతు , నాణ్యత ప్రధానంగా ఆ ప్రాజెక్ట్ వెనుక ఉన్న రచయితలు , చిత్రనిర్మాతల చేతుల్లోనే ఉంటుందని డింపుల్ నొక్కి చెప్పారు. పరిశ్రమలోకి అడుగు పెట్టే చాలా మంది మహిళలు తమ కెరీర్ను నిలబెట్టుకునే క్రమంలో లభించిన అవకాశాలను అంగీకరిస్తుంటారని తెలిపారు. అందువల్ల, వారి పాత్రలలో లోపం ఉన్నా లేదా కేవలం గ్లామర్ అంశాలకే పరిమితం చేసినా వారిని నిందించ కూడదని ఆమె వాదించారు.
