ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సంఘం సమీక్ష

ఉండవల్లి : విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగష్టు 1వ తేదీన రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రుల సంఘం అధికారులను ఆదేశించింది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్ల గురించి తీసుకుంటున్న చర్యలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక, భద్రత, వివిధ గ్యాలరీలు, గ్రీన్ రూమ్స్, జనసమీకరణ, పార్కింగ్, రవాణా, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రుల సంఘం పలు సూచనలు చేసింది. ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రాక నేపథ్యంలో విద్యార్థినులతో పెద్ద ఎత్తున థింసా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. అరకు కాఫీ విశిష్టతను తెలిపేలా స్టాల్ ఏర్పాటు పైనా సమావేశంలో చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రుల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ప్రధానమంత్రి పర్యటన నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!