యోగతో సమతుల్యత, ప్రశాంతత సాధ్యం

టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆశాభావం

తిరుపతి : యోగ సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం (జూన్ 21) సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూన్ 7 నుంచి 21 వరకు టీటీడీ ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా యోగ సాధనలో పాల్గొనాలని సూచించారు. యోగాభ్యాసం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. ప్రారంభంలో యోగ కొంత కష్టంగా అనిపించినప్పటికీ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చని చెప్పారు.

యోగతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెంపొందుతాయని వివరించారు ఈవో ర‌విచంద్ర‌. ఇదిలా ఉండ‌గా మానసిక ఒత్తిడికి యోగానే ఉత్తమ పరిష్కారం అని అన్నారు అడిషనల్ ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి. నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి యోగ సాధన అత్యంత అవసరమని అన్నారు. యోగ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.

భయం, ఆందోళన, ఉద్వేగాల వంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగ ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు వంటి మహనీయులు సైతం యోగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!