ప్రజల కోసం ఎన్ని దెబ్బలైనా భరించడానికి సిద్ధం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఎంపీ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా విద్యార్థులు, రైతులు లేదా యువత ఇలా భారత ప్రజల ఆకాంక్షలను తెలియ జేయడమే తన బాధ్యత అని గాంధీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకటి రెండు దెబ్బలు తగలడం పెద్ద సమస్యేమీ కాదు, ప్రజల కోసం మరిన్ని దెబ్బలు తినడానికైనా నేను సంతోషంగా సిద్ద‌మేన‌ని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల చేపట్టిన నిరసన సందర్భంగా బలవంతంగా తరలిస్తున్నప్పుడు తనకు దెబ్బలు తగిలాయన్న అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన బాధ్యత అని గాంధీ మ‌రోసారి పునరుద్ఘాటించారు. భారత ప్రజల గొంతుకగా నిలవడం నా బాధ్యత. ఎక్కడైతే ప్రజలు బాధను అనుభవిస్తున్నారో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకు రావడం నా కర్తవ్యం అని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇవి చాలా చిన్న విషయాలు, పెద్ద సమస్యలేమీ కావు అని ఆయన అన్నారు.

ఇలా చేయడం అంటే నా ప్రజల ఆకాంక్షలకు అండగా నిలవడం – నాకు దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు . ప్రధాన మంత్రి నివాసం బయట తాను చేపట్టిన నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు తీసుకున్న చర్యల గురించి ప్రస్తావించారు. పోలీసులు తనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం వాస్తవమేనని, అయితే అదే సమయంలో వారు తన చెవిలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి అని అన్నారని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు. నేను రాజస్థాన్ వాడిని, వీరిని (ప్రభుత్వాన్ని) గద్దె దించండి… నేను హర్యానా వాడిని, వీరిని గద్దె దించండి అని తనను అక్కడి నుంచి తరలించిన పోలీసులు అన్నారని ఆయన చెప్పగానే అక్కడి వారంతా నవ్వుల్లో మునిగి పోయారు.

కాబట్టి ఆ భావన అక్కడ ఉంది. అందరికీ నిజం తెలుసు. వివేకం ఉన్న పోలీసులు దీనిని దేశ భవిష్యత్తుకు జరుగుతున్న అన్యాయంగా భావిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తు ఉంది, దేశం దృష్టి తమ సమస్యలపైనే ఉండాలని వారు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రజల దృష్టిని మళ్లించే శక్తులు ఉన్నాయి. ఇక్కడ రెండు శక్తులు పని చేస్తున్నాయి , ఒకటి సమస్యలపై దృష్టి సారించేది, మరొకటి దృష్టిని మళ్లించేదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!