హైదరాబాద్ ,జోజిలా (శ్రీనగర్ ) : మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ ఎల్ ) ఆద్వర్యంలో నిర్మించిన 13.153 కిలోమీటర్ల పొడవైన జోజిలా రహదారి సొరంగం (జోజిలా టన్నెల్)లో తుది బ్రేక్‌థ్రూను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మితమవుతున్న అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ (బై-డైరెక్షనల్) రహదారి సొరంగం తవ్వక పనులు పూర్తై చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా , జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ , కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పీ వీ కృష్ణారెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ ), ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులు, ఇంజినీర్లు, ప్రాజెక్టు సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్ హెచ్ ఐ డి సి ఎల్) తరఫున ఎం ఈ ఐ ఎల్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. బాల్తాల్ , మీనామార్గ్ మధ్య వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హిమాలయ కారిడార్‌కు అన్ని కాలాల్లో (ఆల్-వెదర్) రహదారి అనుసంధానం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూ , కాశ్మీర్ , లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉన్న జోజిలా ప్రాంతంలో, సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో ఈ సొరంగం నిర్మితమవుతోంది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు . ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, శ్రీనగర్–కార్గిల్–లేహ్ మార్గంలో ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించవచ్చు. . ప్రస్తుతం ఈ మార్గం భారీ మంచు కురిసే శీతాకాలంలో, హిమపాతాల (అవలాంచ్) ప్రమాదాల కారణంగా దీర్ఘకాలం మూసి వేస్తున్నారు. ఇక నుంచి ఆ సమస్య ఉండదు.
