అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ-పెర్ఫార్మెన్సు ఇండికేటర్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్షకు హాజరయ్యారు ఆర్ధిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను నిర్దేశించారు సీఎం. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగు పరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర- క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం 3.5 రెట్ల మేర ఆర్ధిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. రియల్ టైమ్ లో ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నె్న్సు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ప్రతీ రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ పెంపుదల చేసేందుకు శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం,రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టులతో ఆర్ధిక వ్యవస్థకు మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేపీఐలు మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు పెరుగుతుందన్నారు.