కేరళ : మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగారు. శనివారం మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి విషయంలో రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానం పని చేయదని అన్నారు. తన వ్యవహార శైలిలో మార్పు వస్తోందని, ఇండియా కూటమిని బలోపేతం చేయక పోగా తరచుగా బీజేపీకి మేలు చేసేలా ఉంటోందన్నారు. కేరళలో ఉన్న రాజకీయ వైరం కారణంగా తాను విజయన్‌ను కౌగిలించుకోనని ‘ఇండియా’ కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎవరు ఎవరిని కౌగిలించుకుంటారనే దాని గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని మాజీ ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు.
అయితే, రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని కౌగిలించుకున్న ఫోటోను మనమందరం చూశామంటూ ఎద్దేవా చేశారు మాజీ సీఎం. మోదీని కౌగిలించ కోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట రాజకీయ సందేశాన్ని ఇస్తాయన్నారు. అవి రాహుల్ గాంధీ విధానాన్ని, ‘ఇండియా’ కూటమి పట్ల ఆయనకున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని అని విజయన్ అన్నారు. ఈ విషయంపై సమగ్ర చర్చ అవసరమని, ప్రస్తుతానికి దీని గురించి వివరంగా మాట్లాడ దలుచుకోలేదని సీనియర్ సీపీఐ(ఎం) నేత చెప్పారు.
ఇండియా’ కూటమి నేడు ఒక నిర్దిష్ట దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తం చేసి, కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడింది మేము మాత్రమే కాదు; అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు, ఇతర ప్రధాన కాంగ్రెసేతర పార్టీలు కూడా తమ అసమ్మతిని తెలిపాయని చెప్పారు.
