ఇరాన్ : మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తరుణంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. పాకిస్థాన్, టర్కీలతో చర్చల్లో భాగంగా దాడులకు పాల్పడవద్దని అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. తమ దేశం గురించి, దాడులకు పాల్పడడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. టెహ్రాన్‌తో చర్చలపై తనకు నమ్మకం సన్నగిల్లుతోందని, అదనపు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. మాటలు వేరు చేతలు వేరని ఈ విషయంలో ట్రంప్ ను తాము నమ్మలేమంటూ పేర్కొంది ఈ సందర్బంగా ఇరాన్. మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలను పెంచుతూ అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై తాజా దాడులు చేస్తే, తాము కూడా నిర్ణయాత్మకంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఎలాంటి సాహసోపేత చర్యలకు పాల్పడవద్దని అమెరికాకు స్పష్టం చేసింది. అవసరమైతే అమెరికా వారిపై దాడి చేస్తుందని పేర్కొనడం పట్ల ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌లతో వేర్వేరు టెలిఫోన్ సంభాషణలలో ఈ సందేశాన్ని అందించారు. అరాఘ్చి టెలిగ్రామ్ ఖాతా ప్రకారం ఎలాంటి దురాక్రమణ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి. సౌదీ విదేశాంగ మంత్రితో తన చర్చ సందర్భంగా అమెరికా లేదా ఇజ్రాయెల్ చేసే ఏ దాడికైనా, లేదా అటువంటి కార్యకలాపాలలో ప్రాంతీయ దేశాలు పాల్గొన్నా, టెహ్రాన్ నుండి తగిన ప్రతిస్పందన ఉంటుందని అరాఘ్చి పేర్కొన్నారు. ఇరాన్ పలు కీలక స్థావరాలపై ప్రయోగించిన శత్రు డ్రోన్లను అడ్డుకుని, ధ్వంసం చేసినట్లు కువైట్ సైన్యం నివేదించిన కొన్ని గంటల తర్వాత ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
