రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు

15, 16వ తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటన

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటగా సీఎం సమావేశం అవుతారు. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు సీఎం హాజరవుతారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో సమావేశం అవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్‌తో చర్చిస్తారు.

వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్‌తోనూ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌తో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ భేటీ అవుతారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశం అవుతారు. హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్‌తో చివరిగా భేటీ అవుతారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్@361ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్-అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్‌ బృందంతో సమావేశం అవుతారు. తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు.

Leave A Reply

Your Email Id will not be published!