చంద్రప్రభ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
బాలగోపాలుని దివ్య దర్శనంతో పరవశించిన భక్తజనం
తిరుపతి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు. చంద్రకాంతుల మధ్య వెన్నముద్దను ధరించిన బాలకృష్ణుని రూపంలో స్వామివారు దర్శనమివ్వగా, గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందంతో నిండి పోయాయి. స్వామి వారి మనోహర రూపాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు.
ఔషధాలకు, జీవజాతికి పోషకుడైన చంద్రభ గవానుడు శాంతి, శీతలత్వం, ఆనందానికి ప్రతీక. చంద్రప్రభ వాహనంపై విహరించే శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల జీవితాల్లో ప్రశాంతత, సౌభాగ్యం, ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదిస్తాడనే సందేశాన్ని ఈ వాహన సేవ చాటి చెబుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వార్షిక బ్రహ్మత్సవాలకు భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు, కరుణ కటాక్షం పొందేందుకు తరలి వస్తున్నారు ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
