రాజ‌ధాని అమ‌రావ‌తిలో వేగంగా నిర్మాణాలు

ఇలాగే అబ‌ద్దాలు చెబితే వైసీపీకి 11 సీట్లు రావు

అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు నిత్యం అబ‌ద్దాల‌తోనే బ‌తుకుతున్నార‌ని, ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని సంద‌ర్శించారు మంత్రి. ఈ సంద‌ర్బంగా అక్క‌డ జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. కొండవీటి వాగు, పాలవాగు లపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను త‌నిఖీ చేశారు.
కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రెండు వాగులపై 69 బ్రిడ్జి లు కడుతున్నాం అని వెల్ల‌డించారు పొంగూరు నారాయ‌ణ‌. వర్షం నీరు పోవడానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం అని వెల్ల‌డించారు.

వర్షాకాలం ఎక్కడ నీరు నిలవకుండా చూస్తున్నాం అని తెలిపారు పొంగూరు నారాయ‌ణ‌. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని స్ప‌ష్టం చేశారు. భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నార‌ని అందులో వాస్త‌వం లేదన్నారు. అవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలేనంటూ కొట్టి పారేశారు.కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు పొంగూరు నారాయ‌ణ‌. అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3393 మాత్రమేన‌ని అన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3684 మాత్రమేన‌ని తెలిపారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్ వి…అందుకే వాటికి ఖర్చు ఎక్కువ అని అన్నారు. ఇక ఇలాగే అబ‌ద్దాలు చెబుతూ పోతే వైసీపీకి ఇప్ప‌టికే ఉన్న ఆ 11 సీట్లు కూడా రావ‌ని జోష్యం చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!