డీజిల్ పొదుపు పాటించాలి ఆర్టీసీని గట్టెక్కించాలి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వై నాగిరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వై నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, నిరంతరం పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో సంస్థపై పడుతున్న భారీ నిర్వహణ భారాన్ని తగ్గించు కునేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ‘బస్ భవన్’లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజిల్ నిర్వహణ అవగాహన సదస్సు లో ఎండీ నాగిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇంధన ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ఇది రవాణా రంగంపై, ముఖ్యంగా ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా అధిగమించాలంటే డీజిల్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, ప్రతి లీటరు ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ వృథాను అరికట్టడం ఒక్కటే సరైన మార్గమని ఎండీ స్పష్టం చేశారు. ఇందుకోసం డిపోల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించు కోవాలని, వాహనాల ఫిట్‌నెస్‌తో పాటు ఉత్తమ నిర్వహణ పద్ధతులను నిరంతరం అలవర్చు కోవాలని అధికారులకు, సాంకేతిక సిబ్బందికి సూచించారు. కేవలం ఇదొక విధి నిర్వహణ మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగికి ఇంధన పొదుపుపై ఒక సామాజిక బాధ్యత ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డీజిల్‌ను ఆదా చేయడం ద్వారా సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా మన వంతు సహకారం అందించిన వారమవుతామని పేర్కొన్నారు.
