గ్రామీణ‌ సినిమా విప్లవకారుడు ‘ఇమయగల్’

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో తీర‌ని విషాదం

చెన్నై : ​భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా దక్షిణ భారత సినిమాలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మహోన్నత దర్శకుడు పి. భారతీరాజా . భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన సృష్టించిన దృశ్య కావ్యాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అంత వరకు నాలుగు గోడల మధ్య, స్టూడియో సెట్లలోనే మగ్గిపోతున్న తమిళ సినిమాని.. తోటలు, పొలాలు, ఊరి రచ్చబండలు, పల్లెటూరి మనుషుల మధ్యకు తీసుకెళ్లిన మొదటి సాహసి ఆయన. అందుకే ఆయన్ని తమిళ చిత్రసీమ గౌరవంగా ‘ఇమయగల్’ (హిమాలయం) అని పిలుచు కుంటుంది. భారతీరాజా సినిమా శైలి.. ఆయన సృష్టించిన ట్రెండ్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

​భారతీరాజా సినిమాల్లో పల్లెటూరు కేవలం ఒక లొకేషన్ కాదు, అదొక పాత్ర. ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’), ‘కిళక్కే పోగుం రైల్’ (తూర్పు వెళ్లే రైలు), ‘సీతాకోకచిలుక’ వంటి చిత్రాల్లో పల్లెటూరి జీవన విధానాన్ని, అక్కడి మనుషుల భావోద్వేగాలను ఎంత సహజంగా చూపించారో మనందరికీ తెలుసు. స్టూడియో లైటింగ్‌ల కంటే సూర్యకాంతిలోనే (Natural Light) షూటింగ్ చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. భారతీరాజాకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత.. కొత్త ప్రతిభను గుర్తించి వెండితెరకు పరిచయం చేయడం. ఇండస్ట్రీని ఏలిన ఎంతో మంది నటీనటులు ఈయన స్కూల్ నుండి వచ్చిన వారే కావ‌డం విశేషం. రాధిక‌ను ‘కిళక్కే పోగుం రైల్’ చిత్రం ద్వారా తొలిసారి హీరోయిన్‌గా పరిచయం చేశారు. రాధ ను ‘అలైగల్ ఓయివత్తిల్లై’ సినిమా ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులకు అద్భుతమైన నటిని అందించారు. రేవతిని క్లాసిక్ హిట్ ‘మణ్ వాసనై’ ద్వారా ఈమెను వెండితెరకు పరిచయం చేసింది భారతీరాజానే. అంతే కాదు తన వద్ద అసిస్టెంట్‌గా ఉన్న భాగ్యరాజ్‌ను ‘పుతియ వార్పుగళ్’ సినిమాతో హీరోగా మార్చి, అగ్ర దర్శకుడిగా ఎదిగేలా ప్రోత్సహించారు.

​భారతీరాజా సినిమా అనగానే గుర్తొచ్చే మరో ప్రత్యేకత.. స్క్రీన్‌పై ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో “ఎన్ ఇనియ తమిళ్ మక్కళే” (నా ప్రియమైన తమిళ ప్రజలారా) అంటూ ఆయన గంభీరమైన వాయిస్‌తో వినిపించే పలకరింపు. అది థియేటర్లలో ప్రేక్షకులకు ఒక రకమైన పూనకాన్ని తెప్పించేది. ఆ సంతకం శైలి ఆయన సొంతం. ​సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు రావడం విశేషం. ​తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ ‘దర్శక శిఖరం’ సృష్టించిన చిత్రాలు, నేటి తరం దర్శకులకు ఒక పాఠ్యపుస్తకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఉన్నంత వరకు మీ పేరు వినబడుతూనే ఉంటుంది.

Leave A Reply

Your Email Id will not be published!