నిత్య అన్న‌దానం భ‌క్తుల పాలిట మ‌హా ప్ర‌సాదం

రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తూ టీటీడీ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిర్వహించ బడుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించి ఉంటుంది.

గత మూడు నెలల సగటు గణాంకాల ప్రకారం రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు అందిస్తున్నారు. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ఈ విధంగా రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి. ప్రధాన అన్నప్రసాద భవనం అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజుకు 82 వేల మందికి పైగా భోజనాలు అందుతుండగా, శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు.

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తున్నారు. అదేవిధంగా 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. అలాగే రోజుకు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలు ఉపయోగిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!