22న వైభవంగా పుష్ప యాగ మహోత్సవం

సుగంధ పుష్పాలతో స్వామి వారికి విశేష ఆరాధన

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో జూన్ 22న పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం జూన్ 21న సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి .22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించగా, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌ల‌క మండ‌లి (టీటీడీ) వెల్ల‌డించింది. ఈ సందర్భంగా వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది.

వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల నిర్వహణలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించింది టీటీడీ. కాగా గృహ‌స్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్ర పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!