Jammu&Kashmir : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అఫ్జల్ గురు పెద్ద సోదరుడు

మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోపోర్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగనుంది...

Jammu&Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. 2011లో పార్లమెంటుపై దాడి ఘటనలో దోషి అఫ్జల్ గురు పెద్ద సోదరుడు అజాజ్ అహ్మద్ గురు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నారు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీలోకి దిగుతున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు సెప్టెంబర్ 12వ తేదీతో గడువు ముగియనుంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోపోర్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగనుంది. అజాజ్ అహ్మద్ గురు 2014లో పశుసంవర్ధక శాఖ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.

Jammu&Kashmir Assembly Elections

ఎన్నికల్లో పోటీపై అజాజ్‌ను ప్రశ్నించినప్పుడు, అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తానెందుకు చేయకూడదని ప్రశ్నించారు. తన సోదరుడు అఫ్జల్ గురు సిద్ధాంతాలకు భిన్నమైన ఐడియాలజీ తనదని అన్నారు. తప్పుడు కేసులతో యువకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, పుణెలో చదువుకుంటున్న తన కుమారుడు షోయిబ్‌ను కూడా తొమ్మిది నెలల క్రితం అరెస్టు చేశారని చెప్పారు. యువకులపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా తాను పోరాటం సాగిస్తానని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జైలులో ఇంజనీర్ రషీద్ కోసం ఆయన కుమారుడు అబ్రార్ రషీద్ ప్రచారం చేశారని, తాను తన కుమారుడి కోసం ఎందుకు ప్రచారం చేయరాదని ప్రశ్నించారు.

షోయిబ్ ఎలాంటి తప్పూ చేయలేదని తాను నిరూపిస్తానని, దీనితో పాటు తప్పుడు ఆరోపణలపై కేసులు పెట్టిన అమాయక ప్రజల అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. 2013లో ఉరితీసిన అఫ్జల్ గురు పేరుతో తాను ఓట్లు అడగనని చెప్పారు. కశ్మీర్‌ లోయలోని ప్రజలను ప్రతి రాజకీయ నేత వంచించారని తాను బలంగా నమ్ముతానని అన్నారు. కొందరు అటానమీ పేరుతో, మరికొందరు స్వయంపాలన పేరుతో, మరి కొందరు ఆజాదీ పేరుతో ప్రజలను వంచించారని అన్నారు. జమ్మూకశ్మీర్(Jammu&Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో పోటీ చేస్తుండగా, పీడీపీ, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.

Also Read : Manipur Violance : మణిపూర్ లో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులు బంద్

Leave A Reply

Your Email Id will not be published!