West Bengal: ట్రామ్ సర్వీసులకు స్వస్తి చెప్పిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం !
ట్రామ్ సర్వీసులకు స్వస్తి చెప్పిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం !
West Bengal: ట్రామ్ పేరు వినగానే మనకు టక్కున పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా గుర్తొస్తుంది. నూట యాభై ఏళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఈ రవాణా సదుపాయం ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నది ఈ ఒక్క నగరంలోనే. అయితే, ఇక అక్కడ కూడా ట్రామ్‌లు కనుమరుగు కానున్నాయి. 150ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ సేవలకు ముగింపు పలకాలని బెంగాల్(West Bengal) సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి స్నేహాశీస్ చక్రబర్తి మంగళవారం వెల్లడించారు.
West Bengal Govt..
‘‘1873లో గుర్రాలతో నడిచే ట్రామ్ లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎన్నో మార్పులతో ఇవి కోల్‌కతా వారసత్వ సంపదలో భాగమయ్యాయి. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ రోజుల్లో రోడ్లపై వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. నెమ్మదిగా నడిచే ట్రామ్‌ల కారణంగా రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీటి సేవలను నిలిపివేయాలని నిర్ణయించాం’’ అని మంత్రి వెల్లడించారు. అయితే, మైదాన్- ఎస్‌ప్లనేడ్ మార్గంలో మాత్రం కొంతకాలం పాటు వీటిని కొనసాగిస్తామని తెలిపారు.
కోల్‌కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ సర్వీసు గతేడాదితో 150 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఒకప్పుడు కోల్‌కతాలో ఎక్కడ చూసినా కన్పించే ఈ రైలుబండ్లు… క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో వీటి నిర్వహణపై కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా… గతేడాది డిసెంబరులో దీనిపై విచారణ జరిగింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ట్రామ్‌కార్ సేవలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.
ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వీటికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు ట్రామ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. వీధుల్లో రోడ్లపై నడిచే రైళ్లనే ట్రామ్ లుగా పిలుస్తారు. సాధారణంగా ఈ రైళ్లు రెండు బోగీలు కలిగి ఉంటాయి.
Also Read : UP CM Yogi : ఆహారంలో కల్తీ విష్యంపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసిన యూపీ సీఎం