Fire: తమిళనాడులో టాటా మొబైల్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం
తమిళనాడులో టాటా మొబైల్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం
Fire: తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఫ్యాక్టరీలోని రసాయన గోదాములో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్)లో గల మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్లోని రసాయన గోదాములో శనివారం ఉదయం 5.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అత్రమత్తమైన సిబ్బంది గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదం ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఏడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.
Fire Incident in Tamilnadu
ఈ కంపెనీలో TEPL సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తోంది. సుమారు 4,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రాత్రిపూట విధుల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారు వెంటనే అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో కొందరు ఉద్యోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ప్రభావిత ప్రాంతంలో 100 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లుగా ఎస్పీ తంగదురై వెల్లడించారు.
Also Read : Bengaluru: తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు