Jammu-PDP : జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు వారి మద్దతుపై స్పష్టత ఇచ్చిన పీడీపీ పార్టీ
ఈ విషయంలో మా పార్టీ చాలా స్పష్టంగా ఉంది...
Jammu : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కానీ, కూటమికి కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చంటూ పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కలిసొచ్చే కాంబినేషన్లు, ముఖ్యంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(PDP) మద్దతు ఎవరికి ఉండవచ్చనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీనిపై పీడీపీ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ సెక్యూలర్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ పేర్కొంది. పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో రాబోయేది సెక్యులర్ ప్రభుత్వమేనని, తమ పార్టీ మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని ప్రకటించారు. దీనిపై మెహబూబా ముఫ్తీ చీఫ్ అడ్వయిజర్ ఇల్తిజా ముఫ్తీ సోమవారంనాడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మరింత స్పష్టత ఇచ్చారు. ” ఈ విషయంలో మా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటాం. సెక్యులర్ ఫ్రంట్‌కు మాత్రమే మా మద్దతు ఉంటుంది” అని చెప్పారు.
Jammu Kashmir-PDP Party…
జమ్మూకశ్మీర్(Jammu) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం, ఎగ్జిట్ పోల్స్ కాలక్షేపం కోసమేనని, ఫలితాలు తమ పార్టీకే అనుకూలంగా రానున్నాయని చెప్పారు. ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి అధికారానికి చేరువ వరకూ రావచ్చని, ఏకైక పెద్ద పార్టీగా మాత్రం ఎన్‌సీ నిలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి 45 నుంచి 50 సీట్లు గెలుచుకోవచ్చని, బీజేపీ 23-27 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలుస్తుందని, పీడీపీ 5-12 సీట్ల వరకూ గెలుచుకోవచ్చని అంచనా వేశాయి. 370 అధికరణ రద్దుకు ముందు జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 65.62 శాతం పోలింగ్ నమోదు కాగా, అధికరణ రద్దు తర్వాత తొలిసారి జరిగిన 2024 ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read : AP Govt : మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఏపీ సర్కార్ కీలక చర్యలు