Minister Ram Mohan : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందని గుర్తు చేశారు...

Ram Mohan : ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan) మాట్లాడుతూ.. వరంగల్‌తోపాటు మరో మూడు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తమను కోరారన్నారు. అయితే పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే.. అనంతరం భూసేకరణకు వెళ్ల వచ్చని ఆయన చెప్పారు.

Minister Ram Mohan Naidu Comment

ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఆ శాఖ నుంచి అనుమతి వస్తే.. ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అదీకాక ఆదిలాబాద్‌కు ఓ వైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్రలు సరిహద్దులు ఉన్నాయన్నారు. దీంతో ఆ దరిదాపుల్లో విమానాశ్రయం లేదని గుర్తు చేశారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు వరంగల్ విమానాశ్రయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ.. భూసేకరణకు ఇప్పటికే సర్క్యులర్ సైతం జారీ చేసిందని ఆయన వివరించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్‌లో విమానాశ్రయాన్ని నిర్మి్స్తామని ఆయన ప్రకటించారు.

ఢిల్లీపర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ మంత్రి కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయడంతో.. ఆయనకు ఎదురేగి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను కేంద్ర మంత్రి శాలువాలతో సత్కరించి.. తిరుమల శ్రీవారి ప్రతిమలను వారికి అందజేశారు. అనంతరం వారు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అందుభాగంగా తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతితోపాటు వరంగల్ విమానాశ్రయం అంశాలపై వారు కులంకుషంగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు,నిధులు తదితర అంశాలను ఈ సందర్బంగా వారితో సీఎం చర్చించనున్నారు.

Also Read : Rahul Gandhi : భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో కులగణన చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!