Asha Workers: ఆశా కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు !

ఆశా కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు !

Asha Workers : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే… ఆశా కార్యకర్తలకూ గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరుకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు వారి ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం అంగీకరించారని ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది.

Asha Workers Got Good News from AP Govt

రాష్ట్రంలో 42,752 మంది ఆశా కార్యకర్తలు(Asha Workers) పనిచేస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది సేవలందిస్తున్నారు. వీరు ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు తమ ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరి వేతనాల కోసం ప్రభుత్వం ఏటా రూ.420 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఆశా కార్యకర్తలకు వేతనాల చెల్లింపు తప్ప ప్రభుత్వపరంగా ఇతర ఆర్థిక ప్రయోజనాలేవీ లేవు. దీనితో ఎన్నికలకు ముందు ఆశా కార్యకర్తలకు న్యాయం చేస్తామని టీడీపీ నేతృత్వంలోని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా చంద్రబాబు(CM Chandrababu) తాజాగా మూడు నిర్ణయాలను ప్రకటించారు.

దీనిలో భాగంగా 30 ఏళ్లపాటు పనిచేసిన ఆశాలకు గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల వరకు చెల్లించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. దీనివల్ల వారికి ఆర్థికభరోసా లభించనుంది. ఆశాలకు గ్రాట్యుటీ విధానం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రసూతి సెలవుల కింద తొలి కాన్పు సమయంలో 3 నెలలు, రెండో కాన్పు సమయంలో మరో 3 నెలల చొప్పున అధికారికంగా సెలవులు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారు. దీనితో సెలవుల కోసం స్థానిక అధికారులను వారు బతిమలాడుకోవాల్సిన పరిస్థితులు తప్పాయి. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం ఆశాలకు కలిసొచ్చే అంశం.

2019కి ముందు కూడా ఆశా కార్యకర్తల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో అవసరమైన వారికి స్మార్ట్‌ ఫోన్లు అందజేశారు. అర్హతలు ఉన్న వారికి ఏఎన్‌ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. రేషన్‌ కార్డులు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కింద ఉచిత వైద్య సదుపాయాలు మంజూరు చేశారు. వృద్ధాప్య పింఛనుకు కూడా అర్హత కల్పించారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా ఇక్కడ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేలు వేతనం కింద చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌లో రూ.750, హిమాచల్‌ప్రదేశ్‌ లో రూ.2,000, రాజస్థాన్‌లో రూ.2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో రూ.3,000, హరియాణా, కర్ణాటకల్లో రూ.4,000, కేరళలో రూ.5,000, సిక్కింలో రూ.6,000, తెలంగాణలో రూ.7,500 చొప్పున మాత్రమే ఆశా వర్కర్లకు వేతనం చెల్లిస్తున్నారు.

Also Read : Blue Flag Beach: రుషికొండ బీచ్‌ కి బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు చేసిన డెన్మార్క్‌ సంస్థ !

Leave A Reply

Your Email Id will not be published!