MLC Kavitha: సీఎం రేవంత్‌ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్

సీఎం రేవంత్‌ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్

MLC Kavitha : పసుపు రైతుల ఆందోళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత(MLC Kavitha) మండిపడ్డారు. అదేవిదంగా నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత(MLC Kavitha) మాట్లాడుతూ… పుసుపు రైతులపై అనేక మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని కవిత ప్రశ్నించారు.

MLC Kavitha Challenge to..

క్వింటా పసుపు పంటకు రూ.15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు పంటకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమేనని కవిత విమర్శించారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని మండిపడ్డారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపు పంటకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారని … కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

కొద్ది రోజులుగా వ్యాపారులు సిండికేటై పసుపు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు… తమను దోపిడీ చేస్తున్నారని, అధికారులు స్పందించి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద, ఆ తర్వాత బస్టాండ్‌ ఎదుట రహదారిపై బైఠాయించి, ధర్నా చేశారు. మార్కెట్‌కు సోమవారం జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున పసుపును తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు వ్యాపారులతో పాటు అధికారులు కూడా కొనుగోలు చేపట్టలేదు. రైతులు ఈ విషయమై మార్కెట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయినా వ్యాపారులు తేమ ఎక్కువగా ఉందని కొనుగోలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేయగా… అక్కడ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పెద్దసంఖ్యలో బస్టాండ్‌ వద్దకు తరలొచ్చి ధర్నా చేశారు. బస్టాండ్‌ నుంచి బస్సులను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… గతేడాది మాదిరిగా క్వింటాలుకు రూ.15వేల వరకు ధర పెట్టి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తాను మార్కెట్‌ కు వస్తానని, కొనుగోలు జరిగే విధంగా చూస్తామని అదనపు కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం రాత్రి వ్యాపారులు, రైతులతో అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ సమావేశమయ్యారు. కొమ్ము రకానికి క్వింటాలుకు రూ.9500కు, మండ రకానికి రూ.8వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Amrutha: ప్రణయ్‌ హత్య కేసులో కోర్టు తీర్పుపై తొలిసారి స్పందించిన అమృత

Leave A Reply

Your Email Id will not be published!