Byrnihat: ప్రపంచంలోనే అత్యంత కలుష్యమైన నగరంగా బిర్నిహాట్‌ !

ప్రపంచంలోనే అత్యంత కలుష్యమైన నగరంగా బిర్నిహాట్‌ !

Byrnihat : ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం కాలుష్య నగరాల జాబితాలోనూ టాప్‌ లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మొదటి 20 నగరాల్లో మనవి ఏకంగా 13 నగరాలున్నాయి. ఇందులో మొదటి స్థానంలో అస్సాంలోని బిర్నిహాట్‌(Byrnihat) నిలిచింది. దేశ రాజధానుల్లో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైందిగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌ కంపెనీ ఐక్యూ ఎయిర్‌ మంగళవారం వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌–2024 పేరిట ఈ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్‌ 2023లో మూడో ర్యాంకులో ఉండగా తాజాగా కాస్తంత మెరుగ్గా ఐదో స్థానానికి చేరింది. టాప్‌–20లోని అత్యంత కలుషితమైన నగరాల్లో పొరుగు దేశం పాకిస్తాన్‌ లోనివి నాలుగు ఉండగా, చైనాకు చెందిన ఒక నగరముంది.

Byrnihat Pollution

ఇక ప్రపంచంలో అత్యంత కలుషితమైన టాప్‌–20 నగరాల్లో… అస్సాంకు చెందిన బిర్నిహట్, ఢిల్లీ, ముల్లన్‌పూర్(పంజాబ్‌), ఫరీదాబాద్, లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్‌ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా ఉన్నాయి. భారత్‌ లోని 35 శాతం నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితికి మించి వార్షిక పీఎం 2.5 స్థాయిలు పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

అస్సాం– మేఘాలయ సరిహద్దుల్లోని బర్నిహట్‌లో డిస్టిలరీలు, ఐరన్, స్టీల్‌ ప్లాంట్ల కారణంగా ఎక్కువ కలుషిత ఉద్గారాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. గాలి కాలుష్యం భారత్‌లో ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని, ఆయుర్దాయం సగటున 5.2 ఏళ్లు తగ్గుతోందని తెలిపింది. భారత్‌ ఏటా 15 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా చనిపోతున్నట్లు లాన్సెట్‌ తెలిపింది.

గాలి నాణ్యత డేటా సేకరణలో భారతదేశం పురోగతి సాధించిందని, అయితే కాలుష్య నియంత్ర‌ణ‌కు తగినంత చర్యలు చేప‌ట్ట‌డం లేద‌ని WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ అన్నారు. ‘మ‌న‌ దగ్గర డేటా ఉంది కాబ‌ట్టి కాలుష్య నివార‌ణ చ‌ర్య‌లు అవసరం. బయోమాస్‌ను LPGతో భర్తీ చేయడం వంటి కొన్ని పరిష్కారాలు సులభంగా చేయొచ్చు. భారతదేశంలో ఇప్పటికే దీని కోసం ఒక పథకం ఉంది, కానీ అదనపు సిలిండర్లకు ప్ర‌భుత్వం మరింత సబ్సిడీ ఇవ్వాలి. మొదటి సిలిండర్ ఉచితం, కానీ పేద కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు అధిక సబ్సిడీలు పొందాలి. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బహిరంగ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నగరాల్లో ప్రజా రవాణాను విస్తరించాలి, అలాగే వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం. ఉద్గార నివార‌ణ‌ చట్టాలను కఠినంగా అమలు చేయడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాల ఉద్గారాల‌ను త‌గ్గించ‌డానికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాలని సౌమ్య స్వామినాథన్ అన్నారు.

Also Read : BRS MLA’s Protest : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!