Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ ఎంక్వయిరీ
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ ఎంక్వయిరీ
Nara Lokesh : ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి(VC Prasad Reddy) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్ విచారణను పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రకటించారు. గురువారం ఉదయం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏయూలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం… రూసా నిధుల దుర్వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ.25 లక్షలను ఖర్చుచేసే విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందింది. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించారని మా దృష్టికి వచ్చింది. మాజీ సీఎం జగన్ విశాఖపట్నం వెళితే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతులు నిలిపివేసి విద్యార్థులను రోడ్లపై నిలిపారు. ఏయూ రిజిస్ట్రార్ సహా అనేక అక్రమ నియామకాలు చేశారు.
Nara Lokesh Enquiry on..
దూరవిద్య పరీక్షల నిర్వహణలో ప్రైవేటు కళాశాలల నుంచి లంచాలు తీసుకోవడం, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం వంటి తీవ్రమైన అభియోగాలు మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై వచ్చాయి. దీనిపై ఇన్‌చార్జి వీసీ ఒక కమిటీని నియమించి అవకతవకలపై నివేదిక కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు 60 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందించాలని విజిలెన్స్‌ను ఆదేశిస్తాం. ఆ నివేదిక వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఏయూలో విద్యనభ్యసించిన ఎందరో ప్రముఖులు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులుగా రాణించారు. ఏయూలో చదివిన వ్యక్తి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామంది ఏయూలో చదువుకుని ఈ స్థాయికి వచ్చారు. నన్ను విద్యాశాఖ మంత్రిగా నియమించేటప్పుడు ఈ ఐదేళ్లలో ఒక్క ప్రభుత్వ వర్సిటీ అయినా టాప్-100 ర్యాంకింగ్‌లో ఉండాలని సీఎం చెప్పారు. అందుకే ఖరగ్‌పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించాం. ఈ వర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తాం’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.
మాజీ వీసి అక్రమాలను వివరించిన ఎమ్మెల్యేలు
అంతకుముందు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో ఆంధ్రా యూనివర్సిటీలో(Andhra University) జరిగిన అవినీతి, అక్రమాలను వివరించారు. ‘ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ప్రొఫెసర్ల నియామకాలు చేశారు. ఆయనకు నచ్చని ప్రొఫెసర్లు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే రూ.25వేలు ఫైన్ వేశారు. తాను వస్తున్నప్పుడు నిలబడలేదనే కారణంగా మరో ఇద్దరు ఎస్టీ ప్రొఫెసర్లపై లేనిపోని ఆరోపణలు మోపి సస్పెండ్ చేశారు. నిధులు దారి మళ్లించారు. ఏయూను ఒక పార్టీకి అడ్డాగా మార్చారు. వర్సిటీ సెనేట్ హాలులో రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇలాంటి వ్యవహారాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని పల్లా శ్రీనివాసరావు కోరారు.
ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ… ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీని మాజీ వీసీ ప్రసాదరెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. జగన్ హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సుమారు 71.05 ఎకరాల్లో 50 నుంచి 70 సంవత్సరాల నాటి భారీ వృక్షాలను నరికేశారు’ అని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, బి-ఫారాలు ఇవ్వడం, ప్రచారం కూడా వర్సిటీ కేంద్రంగానే నిర్వహించారని గణబాబు తెలిపారు. ఏయూలో భూములు కబ్జాలు, ఆక్రమణలకు గురయ్యాయని, దీనిపైనా విచారణ జరిపి వర్సిటీ భూములను కాపాడాలని, మద్యం, డ్రగ్స్ వర్సిటీలోకి వెళ్లకుండా అరికట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు. ఏయూను రాజకీయ క్రీడలకు వేదికగా మార్చేయడం విచారకరమని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఆంధ్రా వర్సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలను ప్రక్షాళన చేయాలని కోరారు.
Also Read : Minister Nara Lokesh: ఏపీలో 2 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ